Telangana High Court: తెలంగాణ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బేషరతుగా క్షమాపణలు కోరారు. న్యాయస్థానాల పట్ల తనకు అత్యంత గౌరవం, విశ్వాసం ఉన్నాయని స్పష్టం చేశారు. కోర్టులు, దేశ న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్న ఆయన.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లోతుకుంట పరిధిలోని సర్వే నంబర్లు 1, 2లో ఉన్న 40 ఎకరాల భూమిలోకి హైడ్రా అధికారులు ప్రవేశించలేదని స్పష్టం చేశారు.
ఆ ప్రాంతంలో ఎలాంటి కూల్చివేతలు లేదా ఇతర చర్యలు చేపట్టలేదని అఫిడవిట్‌లో వివరించారు. అయితే వాస్తవాలకు విరుద్ధంగా కొన్ని ఆరోపణలు చేస్తూ పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. జరిగిన పరిణామాలపై న్యాయస్థానం పట్ల తన గౌరవాన్ని చాటుకుంటూ క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పలు కీలక ప్రశ్నలు లేవనెత్తింది.
హైడ్రా కమిషనర్‌పై ఇప్పటివరకు దాదాపు 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయని గుర్తుచేసింది. ఒకే అధికారిపై ఇన్ని పిటిషన్లు రావడానికి కారణాలేమిటని ప్రశ్నించింది. కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అధికారులు పాటించకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయా అని ధర్మాసనం రంగనాథ్‌తో పాటు ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. చట్ట నిబంధనలు, కోర్టు ఆదేశాలను కచ్చితంగా పాటిస్తూ అధికారులు వ్యవహరించాలని న్యాయస్థానం సూచించింది.








