PIB Fact Check: సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కొన్ని వీడియోలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీ విద్యార్థుల ఆందోళనలకు సంబంధించినవిగా ప్రచారం అవుతున్న ఈ వీడియోల్లో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ఆర్మీ అధికారులు బెదిరింపు వ్యాఖ్యలు చేసినట్లు చూపిస్తున్నారు. ప్రచారం అవుతున్న వీడియోలపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టత ఇచ్చింది. వైరల్ అవుతున్న అన్ని వీడియోలు కృత్రిమ మేధస్సు (AI) సాయంతో రూపొందించిన నకిలీ వీడియోలేనని పేర్కొంది.
ఆ వీడియోల్లో వినిపిస్తున్న వ్యాఖ్యలను ప్రధాని మోడీ లేదా కేంద్ర మంత్రులు ఎప్పుడూ చేయలేదని వెల్లడించింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అసలు వీడియోలను మార్ఫింగ్ చేసి ఈ ఫేక్ కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నారని తెలిపింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఆందోళనలను ఆసరాగా చేసుకుని పాకిస్థాన్‌కు చెందిన కొన్ని సోషల్ మీడియా ఖాతాలు ఈ వీడియోలను విస్తృతంగా షేర్ చేస్తున్నట్లు పీఐబీ ఆరోపించింది.
గురువారం ప్రధాని మోడీ ప్రశ్నపత్రాల లీకేజీలపై చేసిన ప్రసంగంతో పాటు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్ వెలుపల మాట్లాడిన వీడియోలను ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి ఈ నకిలీ వీడియోలు తయారు చేసినట్లు వెల్లడించింది. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి సమాచారాన్ని నిజమని నమ్మకుండా, అధికారికంగా ధృవీకరించుకున్న తర్వాతే షేర్ చేయాలని పీఐబీ ప్రజలకు సూచించింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుమానాస్పద పోస్టులు లేదా వీడియోలు కనిపిస్తే వెంటనే పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌కు వాట్సాప్ లేదా ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరింది.
ALSO READ: Mohan Bhagwat | పిల్లల ప్రశ్నలకు పేరెంట్స్ వద్ద సమాధానాలున్నాయా?.. మోహన్ భగవత్ ప్రశ్న








