Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం లాహౌల్-స్పితిలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో టాటా సుమో టాక్సీ శిథిలాల కింద చిక్కుకుంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఉదయ్‌పూర్-కిలార్ రహదారిలోని కడూ నాలా ప్రాంతంలో ప్రయాణిస్తున్న టాటా సుమో టాక్సీపై ఒక్కసారిగా భారీ రాళ్లు, మట్టి కుప్పలు కూలిపడటంతో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. వాహనంలో 15 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వారిలో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడగా, మిగిలినవారు మరణించినట్లు స్థానిక కథనాలు చెబుతున్నాయి. అయితే అధికారికంగా మృతుల సంఖ్య ఇంకా ప్రకటించలేదు.
ప్రమాదం జరిగిన వెంటనే టాక్సీ వెనుక భాగంలో మంటలు చెలరేగడంతో పరిస్థితి మరింత విషమించింది. స్థానికులు, భద్రతా సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గురువారం వర్షాల కారణంగా మూసివేసిన ఉదయ్‌పూర్-కిలార్ రహదారిని శుక్రవారం ఉదయం తిరిగి తెరవడంతో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు బయలుదేరారు. అయితే కడూ నాలా వద్దకు చేరుకున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. బాధితులంతా పాంగి లోయ ప్రాంతానికి చెందిన వారిగా భావిస్తున్నప్పటికీ, పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
ALSO READ: Chennai Love Story | ‘చెన్నై లవ్ స్టోరీ’కి గ్రాండ్ స్టార్ట్.. ప్రీమియర్స్‌తోనే రూ.3.13 కోట్ల గ్రాస్








