CM Revanth Reddy: హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా (CURE) పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. నిరుపేదలకు కేటాయించే ఇళ్లు నగరానికి దూరంగా కాకుండా, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండే జనావాసాల మధ్యే నిర్మించాలని అధికారులను స్పష్టం చేశారు. ఇందుకోసం ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన వినియోగంలో లేని స్థలాలను గుర్తించాలని సూచించారు. అవసరమైతే పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖల ఖాళీ భూములను వినియోగించి, వాటికి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని ఆదేశించారు.
క్యూర్ పరిధిలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి దశలో 7,680 ఇందిరమ్మ ఫ్లాట్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఒక్కో ఫ్లాట్‌ను 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో నిర్మించనున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయం సుమారు రూ.11 లక్షలు కాగా, అందులో రూ.5 లక్షలను ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తుంది. మిగిలిన రూ.6 లక్షలను లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. భూమి వ్యయాన్ని మాత్రం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. 17 నియోజకవర్గాల పరిధిలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను ఖరారు చేయాలని సీఎం సూచించారు.








