తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కందుల జెస్సీ(Kandula Jessi) అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలో తొలి ఆల్-గర్ల్స్ లూనార్ క్యూబ్‌శాట్ ప్రాజెక్ట్ ‘మిషన్ శక్తి శాట్’(Mission Shakti Sat)కు ఎంపికై అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 108 దేశాల నుంచి సుమారు 12 వేల మంది బాలికలు దరఖాస్తు చేయగా, భారత్ నుంచి ఎంపికైన 20 మందిలో జెస్సీ ఒకరిగా నిలిచింది. ఈ ప్రాజెక్టుకు ఎంపికైన ఏకైక ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని కావడం విశేషం.
జెస్సీలోని ప్రతిభను గుర్తించిన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలు మణిమాల ప్రోత్సాహంతో ఆమె ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. పాఠశాల చదువులతో పాటు ఆన్‌లైన్‌లో స్పేస్ టెక్నాలజీ శిక్షణను పూర్తి చేస్తూ శాటిలైట్ వ్యవస్థలు, ప్రొపల్షన్, థర్మోడైనమిక్స్ వంటి అంశాల్లో నైపుణ్యం పెంపొందించుకుంది. ఇంగ్లిష్‌లో జరిగిన ఇంటర్వ్యూను కూడా విజయవంతంగా పూర్తి చేసి తుది జాబితాలో స్థానం సంపాదించింది.
ఆగస్టు 23 నుంచి ఢిల్లీలో జరిగే శిక్షణలో పాల్గొని శాటిలైట్ రూపకల్పన, మిషన్ ఆపరేషన్స్‌పై ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందనుంది. విద్యార్థినులు రూపొందించే లూనార్ క్యూబ్‌శాట్‌ను అక్టోబర్ 11న శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు. వడ్రంగిగా పనిచేసే తండ్రి కుటుంబానికి చెందిన జెస్సీ భవిష్యత్తులో ఇస్రోలో చేరి దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఆమె విజయంపై మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.
ALSO READ: COVID-19 | ఆరు కొత్త కేసులు.. ఏపీలో కరోనా వేగం, ఒమిక్రాన్ RF-5 వేరియంట్ కలవరపాటు!








