COVID-19: ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. తాజాగా బుధవారం మరో ఆరు మందికి వైరస్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 32కు చేరింది. కొత్త కేసుల్లో విశాఖపట్నంలో మూడు, రాజమహేంద్రవరంలో మూడు నమోదయ్యాయి. ఇదే సమయంలో కడప జిల్లాకు చెందిన నమూనాల్లో ఒమిక్రాన్ RF-5 వేరియంట్ ఉన్నట్లు పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్ధారించింది. దీంతో పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. జిల్లాల వారీగా చూస్తే కడపలో అత్యధికంగా 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆరు చొప్పున, విశాఖలో మూడు, కాకినాడ, బాపట్ల జిల్లాల్లో రెండు చొప్పున కేసులు ఉన్నాయి.
పార్వతీపురం మన్యం, ఏలూరు, ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. ఇప్పటివరకు నలుగురు మృతి చెందినప్పటికీ, వారికి ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కరోనా పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. 17 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 255 ప్రత్యేక వార్డులను సిద్ధం చేయడంతో పాటు మాస్కులు, ఎన్-95 మాస్కులు, పీపీఈ కిట్లు, మందులు, టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచింది.
అత్యవసర పరిస్థితుల్లో వైద్య సామగ్రి వెంటనే కొనుగోలు చేసే అధికారాలను ఆస్పత్రి సూపరింటెండెంట్లకు ఇచ్చింది. ప్రజలు భయపడకుండా, జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్యశాఖ సూచించింది.
ALSO READ: PM Modi | పేపర్ లీక్‌లపై రాజీ లేదు.. మోడీ సర్కార్ కఠిన నిర్ణయం








