తెలంగాణలో రేషన్ వ్యవస్థను మరింత ఆధునికంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డు( Smart Ration Card)లను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు కార్డుల స్థానంలో పీవీసీ ప్లాస్టిక్‌తో రూపొందించిన స్మార్ట్ కార్డులను మరో వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పంపిణీని ప్రారంభించనుండగా, అదే సమయంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కార్డులు అందజేయనున్నారు. కొత్త స్మార్ట్ రేషన్ కార్డులో లబ్ధిదారుడి వ్యక్తిగత వివరాలతో పాటు క్యూఆర్ కోడ్, ప్రత్యేక ఆహార భద్రతా కార్డు సంఖ్యను పొందుపరిచారు.
కాగితపు కార్డులు త్వరగా దెబ్బతింటుండటంతో వాటి స్థానంలో ఈ స్మార్ట్ కార్డులను ప్రవేశపెడుతున్నారు. మరోవైపు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 1 నుంచి నెల రోజుల పాటు రేషన్ దుకాణాల ద్వారా మూడు నెలల బియ్యం అందజేయనున్నారు. అయితే రేషన్ సరుకులు పొందాలంటే ఈ-కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేశారు. జూలై 31 వరకు గడువు ఉండగా, ఇతర ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులు కూడా సమీప రేషన్ దుకాణంలో ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయని వారికి రేషన్ పంపిణీ ఉండదని అధికారులు హెచ్చరించారు.
ALSO READ: Parliament Monsoon Session | యువతే భారత్ బలం.. పార్లమెంట్ సమావేశాల ముందు మోడీ కీలక సందేశం








