Telangana government: తెలంగాణలో ప్రభుత్వ కొలువులపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఊరట కలిగించే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 1,500 కండక్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నియామకాలను టీజీఎస్‌ఆర్టీసీ స్వయంగా నిర్వహించనుండగా, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత శాశ్వత ప్రాతిపదికన ఇంత పెద్ద ఎత్తున కండక్టర్ పోస్టుల భర్తీ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఈ నియామకాల్లో అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించకపోవడం ప్రధాన ఆకర్షణగా మారింది. పదో తరగతి (SSC)లో సాధించిన మార్కులు లేదా వాటి సమాన శాతాన్ని ఆధారంగా తీసుకుని, ప్రభుత్వ రోస్టర్ విధానం, రిజర్వేషన్ నిబంధనలను అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో పోటీ పరీక్షల ఒత్తిడి లేకుండానే ఉద్యోగం పొందే అవకాశం ఉండటంతో అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది. గత కొన్నేళ్లుగా పదవీ విరమణల కారణంగా ఆర్టీసీలో ఖాళీలు పెరిగినా, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాత్కాలిక సిబ్బందితోనే సేవలు కొనసాగించారు. అయితే ప్రస్తుతం శాశ్వత నియామకాలకు అనుమతి లభించడంతో ఉద్యోగ వ్యవస్థ బలోపేతం కానుందని అధికారులు భావిస్తున్నారు.
అయితే అధికారిక నోటిఫికేషన్ విడుదలకు ముందు ఒక కీలక అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. గతంలో కొంతమంది విద్యార్థులు మార్కుల విధానంలో, మరికొందరు GPA విధానంలో పదో తరగతి పూర్తి చేశారు. ఈ రెండు విధానాలను ఒకే ప్రమాణంతో ఎలా అంచనా వేయాలనే అంశంపై టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు ఎస్‌ఎస్‌సీ బోర్డును మార్గదర్శకాలు కోరారు. బోర్డు నుంచి స్పష్టత వచ్చిన వెంటనే నియామక నోటిఫికేషన్ విడుదల చేసి, దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించనున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతలో ఆశలు మరింత పెరిగాయి.








