బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు సాధారణమే. అయితే ఈసారి ట్రాఫిక్‌కు కారణమైనది వాహనాల రద్దీ కాదు.. ఓ భారీ తాచుపాము. నగరంలోని ప్యాలెస్ రోడ్డులో చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడి వాహనదారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. సాయంత్రం రద్దీ సమయంలో రోడ్డుమధ్యకు వచ్చిన కోబ్రా పడగ విప్పి చాలాసేపు అక్కడే ఉండిపోయింది. వాహనాలు దాని దగ్గరికి వెళ్లేందుకు ఎవరూ సాహసించకపోవడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది(Cobra Blocks Traffic). దాదాపు అరగంటకు పైగా పాము అదే చోట ఉండటంతో రెండు వైపులా వాహనాల క్యూలు ఏర్పడ్డాయి.
పామును చూసిన కొందరు వెంటనే మొబైల్ ఫోన్లలో వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొద్ది నిమిషాల్లోనే ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. పాము ప్రశాంతంగా నిలబడి ఉండగా, వాహనదారులు మాత్రం దూరం పాటిస్తూ అప్రమత్తంగా వ్యవహరించారు. అనంతరం పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో సరదా కామెంట్ల వర్షం కురుస్తోంది.
“బెంగళూరు ట్రాఫిక్‌ను ఆపగలిగింది చివరకు ఒక కోబ్రానే”, “ట్రాఫిక్ సిగ్నల్స్‌ను కూడా పట్టించుకోని వీఐపీ అతిథి” అంటూ నెటిజన్లు హాస్యభరితంగా స్పందిస్తున్నారు. మరికొందరు మాత్రం నగర ప్రాంతాల్లో అడవి జంతువులు, పాములు కనిపించడం పర్యావరణ మార్పులకు సంకేతమని అభిప్రాయపడుతున్నారు. రోడ్డుపై పాము కనిపించినప్పుడు దానికి దగ్గరగా వెళ్లకుండా, వెంటనే అటవీ శాఖ లేదా రెస్క్యూ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.








