Sri Guru Singh Sabha Sahib: చారిత్రక ప్రాధాన్యం ఉన్న 125 ఏళ్ల గురుద్వారాను పాకిస్థాన్‌లో కూల్చివేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ చర్యపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఫరూఖాబాద్ ప్రాంతంలో ఉన్న గురుద్వారా శ్రీ గురు సింగ్ సభ్ సాహిబ్ భవనాన్ని ఓ స్థానిక వ్యాపారి కూల్చివేయడంతో వివాదం చెలరేగింది. ఈ చర్యపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సిక్కు మత విశ్వాసాలను దెబ్బతీసే ఘటనగా అభివర్ణించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరింది.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ధ్వంసమైన గురుద్వారాను యథాతథంగా పునర్నిర్మించాలని డిమాండ్ చేసింది. పాకిస్థాన్‌లో మైనారిటీల ప్రార్థనా స్థలాల రక్షణలో అక్కడి ప్రభుత్వం విఫలమవుతోందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వ్యాఖ్యానించారు. ఈ ఘటన స్థానిక సిక్కు వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీయగా, పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. అనంతరం పంజాబ్ ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి రమేష్ సింగ్ అరోరా అధికారులతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
మైనారిటీల మతపరమైన వారసత్వాన్ని పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంటూ, గురుద్వారా పునరుద్ధరణకు చర్యలు ప్రారంభిస్తామని వెల్లడించారు. అలాగే భూమి యాజమాన్యానికి సంబంధించిన వివాదంపై ప్రత్యేక దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించారు. అయితే పునర్నిర్మాణ నిర్ణయంపై స్థానిక వ్యాపారులు, నివాసితుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో నివసిస్తూ జీవనోపాధి పొందుతున్న కుటుంబాల పరిస్థితిని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. పునరావాసం, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.








