Gold and Silver Prices: కొద్ది రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మరోసారి పైకి ఎగబాకాయి. ధరలు మరింత తగ్గుతాయని భావించి కొనుగోళ్లను వాయిదా వేసుకున్న వారికి గురువారం మార్కెట్ ఊహించని షాక్ ఇచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల నమోదైంది.
తాజా రేట్ల ప్రకారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఒకేసారి రూ.3,770 పెరిగి రూ.1,44,550కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం కూడా ధరలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. 10 గ్రాముల ధర రూ.3,450 ఎగబాకి రూ.1,32,500కు చేరుకుంది. బంగారం ధరలతో పాటు వెండి రేట్లు కూడా పెరుగుదల దిశగా పయనించాయి. కిలో వెండి ధరపై రూ.5,000 పెరగడంతో ప్రస్తుతం అది రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలకు జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే నగరాలు, జ్యువెలరీ దుకాణాలను బట్టి రేట్లలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.
పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో బంగారానికి డిమాండ్ పెరగడం ధరలపై ప్రభావం చూపిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ధరలు తగ్గిన సమయంలో పెట్టుబడిదారులు కూడా పెద్దఎత్తున బంగారం కొనుగోలు చేయడం ప్రారంభించారని, దీంతో డిమాండ్ పెరిగి ధరలు మళ్లీ ఎగబాకినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, దేశీయ డిమాండ్ కూడా ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు.








