Saturday, August 1, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshAndhra Pradesh | పశుపోషకులకు ఆర్థిక భరోసా.. పశుబీమా రాయితీ 85 శాతానికి పెంపు

Andhra Pradesh | పశుపోషకులకు ఆర్థిక భరోసా.. పశుబీమా రాయితీ 85 శాతానికి పెంపు

-

Chat on WhatsApp

Andhra Pradesh: రాష్ట్ర పశుసంవర్ధక రంగంలో గత రెండేళ్లలో గణనీయమైన పురోగతి సాధించినట్లు శాఖ అధికారులు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న పశుబీమా క్లెయిమ్‌లను పూర్తిగా పరిష్కరించి రైతులకు భారీ ఊరట కల్పించినట్లు తెలిపారు. ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.110 కోట్ల బకాయిలను ప్రస్తుత ప్రభుత్వం గత రెండేళ్లలో పూర్తిగా చెల్లించినట్లు పశుసంవర్ధక శాఖ ప్రకటించింది.

పశుబీమా ప్రీమియంపై రాయితీని 80 శాతం నుంచి 85 శాతానికి పెంచడం ద్వారా పశుపోషకులకు మరింత ఆర్థిక భద్రత కల్పించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు సుమారు 60 వేల పశువులకు బీమా సౌకర్యం అందించబడిందని అధికారులు తెలిపారు. వరదలు, తుపాన్లు వంటి ప్రకృతి విపత్తుల వల్ల పశువులు మృతి చెందితే అందించే పరిహారాన్ని రూ.37,500 నుంచి రూ.50 వేలకు పెంచినట్లు వెల్లడించారు.

రాష్ట్ర పశుసంవర్ధక రంగం స్థూల వార్షిక ఉత్పత్తిలో 12.17 శాతం వాటా నమోదు చేయడం గమనార్హం. 2025–26 నాటికి గుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలో మొదటి స్థానాన్ని సాధించగా, మాంసం ఉత్పత్తిలో నాలుగో స్థానం, పాల ఉత్పత్తిలో ఏడో స్థానంలో నిలిచింది. ఒంగోలు గిత్తలు, పుంగనూరు ఆవులు, నెల్లూరు, మాచర్ల గొర్రెలు, ఆశిల్ కోళ్లు వంటి జాతులు రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చినట్లు శాఖ పేర్కొంది. ఆధునిక పశుసంవర్ధక సాంకేతికతల్లో భాగంగా ఐవీఎఫ్, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ విధానాల ద్వారా 67 అత్యుత్తమ దూడలను ఉత్పత్తి చేసినట్లు వెల్లడించారు.

గత రెండేళ్లలో ఉచిత నట్టల నివారణ మందులు పంపిణీ, 26,512 పశువైద్య శిబిరాల నిర్వహణ, 23 లక్షల పశువులకు వైద్యసేవలు, 30,313 పశు షెడ్ల నిర్మాణం, 20,543 నీటి తొట్టెల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే సమీకృత దాణా, పశుగ్రాస విత్తనాలు, లింగ నిర్ధారిత వీర్య నాళికల పంపిణీ ద్వారా పశుపోషకులకు భారీ లాభాలు కలిగినట్లు పేర్కొన్నారు.

2026–27లో పౌల్ట్రీ పాలసీ అమలు, 777 కొత్త పశువైద్యశాల భవనాలు, పశువైద్య పోస్టుల భర్తీ, 10 లక్షల లింగ నిర్ధారిత వీర్య నాళికల వినియోగం వంటి కీలక కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు శాఖ స్పష్టం చేసింది. 2029–30 నాటికి పశుసంవర్ధక రంగాన్ని రూ.3 లక్షల కోట్ల జీఎస్‌డీపీ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp