హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్ వైపు ప్రయాణం ప్రారంభించిన ఇండిగో విమానం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మార్గంలోనే రాజమండ్రి విమానాశ్రయంలో అత్యవసరంగా దిగాల్సి వచ్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విశ్వసనీయ సమాచారం మేరకు, సుమారు 60 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ ఫ్లైట్ జగదల్పూర్ దగ్గరికి చేరే సరికి వాతావరణం అనూహ్యంగా క్షీణించింది. రన్‌వేపై సురక్షితంగా ల్యాండింగ్ చేయడానికి అవసరమైన పరిస్థితులు లేకపోవడంతో పైలట్ అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రతను ప్రధానంగా తీసుకుని, విమానాన్ని వెంటనే రాజమండ్రి విమానాశ్రయానికి మళ్లించారు.
రాజమండ్రిలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తరువాత అవసరమైన ఇంధనాన్ని నింపారు. అనంతరం వాతావరణ పరిస్థితులు ఇంకా అనుకూలించకపోవడంతో అదే విమానం తిరిగి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి పయనమైంది. ఈ అనుకోని పరిణామంతో ప్రయాణికులు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు.
అయితే విమానాశ్రయ అధికారులు, సిబ్బంది తక్షణమే భద్రతా చర్యలు చేపట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మొత్తం ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. వాతావరణ మార్పుల కారణంగా ఈ రూట్లో విమానం డైవర్ట్ చేయాల్సి వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనతో ప్రయాణికులు క్షణిక ఆందోళనకు గురైనా, చివరికి అందరూ సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.
ALSO READ: CM Revanth Reddy | డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు








