KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన జూలై 24 పుట్టినరోజును వేడుకగా జరుపుకోకుండా ప్రజా సమస్యలపై పోరాటానికి అంకితం చేయాలని నిర్ణయించారు. ఢిల్లీలో నీట్ పరీక్ష అక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈసారి శుభాకాంక్షలు, వేడుకలకు బదులుగా విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా నిలవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
నీట్ పేపర్ లీకేజీ, విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. ఆందోళనను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడం, లాఠీచార్జ్ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట కూడా చోటుచేసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద భారీ నిరసన చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ స్వయంగా పాల్గొని విద్యార్థులకు మద్దతు ప్రకటించనున్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాల్లో తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని బీఆర్ఎస్ నాయకత్వం స్పష్టం చేసింది.
ALSO READ: IND vs ZIM | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా, అరంగేట్రం ఏవేరంటే ?








