TVK Vijay: సినీ తారలు, రాజకీయ నాయకులపై అభిమానులు ప్రేమాభిమానాలు చూపించడం కొత్త విషయం కాదు. అయితే తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు కారణమవుతోంది. తిరుచ్చి ప్రాంతానికి చెందిన ఓ టీవీకే కార్యకర్త తన అభిమాన నాయకుడు విజయ్‌కు ఇంట్లోనే ప్రత్యేక స్థానం కల్పించడం అందరి దృష్టిని ఆకర్షించింది. సుకుమార్ షణ్ముగం అనే వ్యక్తి తన నివాసంలోని పూజా గదిలో విజయ్ ప్రతిమను ఏర్పాటు చేశాడు.
అంతేకాదు, ప్రతిరోజూ ఆ ప్రతిమకు పూలు సమర్పించడం, హారతి ఇవ్వడం వంటి ఆరాధనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియా వేదికల్లో వేగంగా వ్యాపించాయి. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీనిని అభిమానానికి ప్రతీకగా అభివర్ణిస్తుండగా, మరికొందరు వ్యక్తులపై ఉన్న మక్కువను ఆరాధన స్థాయికి తీసుకెళ్లడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.
సమాజంలో ప్రముఖులపై అభిమాన సంస్కృతి ఎంతగా ప్రభావం చూపుతుందో ఈ సంఘటన మరోసారి చర్చకు తెరలేపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతుంది.








