DK Shivakumar: కర్ణాటక రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ శాసనసభాపక్ష (CLP) నాయకుడిగా డీకే శివకుమార్‌ను పార్టీ ఎమ్మెల్యేలంతా ఏకాభిప్రాయంతో ఎన్నుకున్నారు. సమావేశంలో పాల్గొన్న సభ్యులు ఆయన పేరును ఏకగ్రీవంగా సమర్థిస్తూ ఆమోదం తెలిపారు.
ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా, సిద్ధరామయ్య తదితరులు హాజరయ్యారు. సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ పేరును సిద్ధరామయ్య ప్రతిపాదించగా, ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
అనంతరం ఈ నిర్ణయాన్ని పార్టీ అధిష్ఠానానికి తెలియజేశారు. ఇక జూన్ 3న డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమం రాజ్‌భవన్‌లోని గ్లాస్ హౌస్‌లో అత్యంత నిరాడంబరంగా జరగనుందని తెలుస్తోంది.
కొత్త ప్రభుత్వంలో మంత్రివర్గాన్ని భారీగా విస్తరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సగం పదవులను కొత్త ముఖాలకు ఇవ్వాలని కొంతమంది నాయకులు సూచించినట్లు సమాచారం. అలాగే డిప్యూటీ సీఎం పదవులు, కీలక శాఖలపై సిద్ధరామయ్య తన వర్గానికి ప్రాధాన్యం కోరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ అంశంపై ఆయన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కూడా కలిసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో డీకే శివకుమార్ తన వ్యక్తిగత జ్యోతిష్యుడిని సంప్రదించి ప్రమాణస్వీకారం తేదీని ఖరారు చేసినట్లు సమాచారం. జూన్ 3 సాయంత్రం సమయం అనుకూలమైన శుభ ఘడియగా భావించడంతో అదే తేదీని ఎంచుకున్నారని ఆయనకు దగ్గర వర్గాలు వెల్లడించాయి.








