Komati Reddy Venkat Reddy: సోషల్ మీడియాలో వచ్చిన ఓ వీడియో ద్వారా ఓ విద్యార్థిని పరిస్థితి తెలుసుకున్న రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెంటనే స్పందించారు. బోడుప్పల్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్న భవిత అనే విద్యార్థిని 10వ తరగతిలో 582 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా స్కూల్ ఫీజు చెల్లించలేక, సర్టిఫికెట్లు పొందలేని పరిస్థితిలో ఉంది.
వైరల్ అయిన సమాచారం ఆధారంగా మంత్రి వెంటనే కార్యాలయ సిబ్బందిని స్పందింపజేసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్‌తో స్వయంగా ఫోన్‌లో మాట్లాడి, విద్యార్థిని ఒరిజినల్ సర్టిఫికెట్లతో మినిస్టర్ క్వార్టర్స్‌కు రావాలని ఆదేశించారు.
ఉదయం 10 గంటలలోపు విద్యార్థిని అక్కడికి చేరుకోగానే మంత్రి ఆమెతో ఆప్యాయంగా మాట్లాడి కుటుంబ పరిస్థితులు, చదువు గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. భవిత పాలిసెట్‌లో 634వ ర్యాంక్ సాధించిందని, డిప్లొమా చేసి ఇంజనీరింగ్ చదవాలనే లక్ష్యాన్ని తెలిపింది. విద్యార్థిని ప్రతిభను చూసి చలించిన మంత్రి వెంటనే స్కూల్ ఫీజు రూ.60 వేలు అక్కడికక్కడే చెల్లించి, సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే తక్షణ ఖర్చుల కోసం రూ.20 వేల ఆర్థిక సహాయం కూడా అందించారు.
భవిష్యత్ చదువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అవసరమైతే ల్యాప్‌టాప్ కూడా అందిస్తానని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై స్పందించిన మంత్రి, ఆపదలో ఉన్న వారికి సాయం చేయడం మానవత్వమని, అది దేవునితో సమానమని పేర్కొన్నారు.
Komati reddy Venkat Reddy | మంచి మనసు చాటుకున్న మంత్రి కోమటి రెడ్డి… విద్యార్థినికి భారీ సాయం
-








