Padma Awards 2026: దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో నిర్వహించనున్న తొలి విడత కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.
దేశ సేవ, కళలు, విజ్ఞానం, సాహిత్యం, సామాజిక సేవ తదితర రంగాల్లో విశేష కృషి చేసిన వారిని ఈ అవార్డులతో సత్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 మంది ప్రముఖులను పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది.
వీటిలో ఐదు పద్మ విభూషణ్‌లు, 13 పద్మ భూషణ్‌లు, 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. సోమవారం జరిగే తొలి విడత కార్యక్రమంలో రెండు పద్మ విభూషణ్‌లు, ఆరు పద్మ భూషణ్‌లు, 58 పద్మశ్రీ అవార్డులు అందజేయనున్నారు. మిగిలిన అవార్డులను రెండో విడత కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు.
కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, విజ్ఞానశాస్త్రం, ఇంజినీరింగ్, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, ప్రజాసేవ వంటి రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ గౌరవం దక్కింది. అసాధారణ సేవలకు పద్మ విభూషణ్, అత్యున్నత సేవలకు పద్మ భూషణ్, విశిష్ట సేవలకు పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఈసారి పద్మ అవార్డుల ఎంపికలో సామాన్యులకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం లభించింది.
సమాజం కోసం నిశ్శబ్దంగా సేవలందిస్తున్న 45 మంది గుర్తింపులేని వ్యక్తులకు పురస్కారాలు ప్రకటించడం విశేషం. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు తమ కృషితో ఈ జాబితాలో చోటు సంపాదించారు.
అలాగే వెనుకబడిన వర్గాలు, దళితులు, గిరిజన సమాజాలకు చెందిన పలువురికి కూడా ఈసారి గౌరవం దక్కనుంది. మహిళలు, దివ్యాంగులు, చిన్నారులు, గిరిజనులు, దళితుల సంక్షేమం కోసం కృషి చేసిన వారిని గుర్తించి పురస్కారాలు ప్రదానం చేయడం పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.








