Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాల(2027) ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కాగితాలపై కాకుండా మీ ప్రణాళికలు నేలమీద పనుల పై కనిపించాలని స్పష్టం చేశారు.
రాజమహేంద్రవరం కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు, కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాలు రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఆధ్యాత్మిక వేడుక అని, ఇప్పటి వరకు తగిన స్థాయిలో సన్నద్ధత కనిపించడం లేదని అన్నారు.
పుష్కరాలకు దాదాపు 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్న ఆయన.. రూ. 8,600 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టాల్సిన పనులకు ఇప్పటికీ పూర్తి స్థాయి DPRలు సిద్ధం కాకపోవడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు.
“ఒకే ఏడాదిలో వేలాది పనులను పూర్తి చేయడం సాధ్యం కాదు. సరైన ప్రణాళిక, సమన్వయం లేకుండా పనులు చేపడితే నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది” అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కేంద్ర నిధుల కోసం స్పష్టమైన ప్రణాళిక, ఖర్చుల అంచనాలు, పూర్తి డేటాతో ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు.
“సమగ్ర ప్రణాళికలు, పూర్తి స్థాయి డీపీఆర్‌లు లేకుండా కేంద్రాన్ని ఆశ్రయిస్తే ప్రధాని నరేంద్ర మోడీ నిధులు మంజూరు చేయరని” పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పర్యాటక శాఖ పనితీరుపై కూడా పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
హడావుడిగా నాసిరకం పనులు చేస్తే భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. “నాసిరకం నిర్మాణాలు జరిగితే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది” అని అన్నారు. గత పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లు కేవలం రాజమండ్రికే పరిమితం కాకుండా ఆరు జిల్లాల్లోని 274 పంచాయతీల వరకు విస్తరించాలని సూచించారు.
భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంతో పాటు గోదావరి నది కాలుష్య నియంత్రణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్ల అంశాన్ని త్వరలో కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాల కోసం అవసరమైన నిధుల సమీకరణలో పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.








