IPL Franchise: ఐపీఎల్ 2026 సీజన్‌లో సరికొత్త సంచలనాలు నమోదవుతున్న వేళ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో కొత్త జట్టు వస్తుందా అని అడిగితే వస్తుంది అనే చెప్పాలి. ఆ జట్టు ఏది అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. 15 ఏళ్ల వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన కేవలం రికార్డులకే పరిమితం కాకుండా, లీగ్ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది.
రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న బిహార్‌కు చెందిన ఈ యువ బ్యాటర్ కేవలం 13 ఇన్నింగ్స్‌ల్లోనే 53 సిక్సర్లు బాదుతూ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అతని విధ్వంసకర ఆటతీరు కారణంగా బిహార్ రాష్ట్రానికి ఐపీఎల్‌లో సొంత ఫ్రాంచైజీ ఉండాలనే ప్రతిపాదన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.
ఈ ఆలోచనకు ఒక ప్రముఖ బిలియనీర్ మద్దతు తెలిపినట్లు సమాచారం. వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనను ప్రశంసిస్తూ, బిహార్‌కు ఐపీఎల్ జట్టు ఉండటం అవసరమని ఆయన సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. అంతేకాకుండా భవిష్యత్తులో కొత్త ఫ్రాంచైజీ కోసం బిడ్ దాఖలు చేయడానికి కూడా ఆయన ఆసక్తి చూపుతున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఐపీఎల్‌లో 10 జట్లు ఉండగా, భవిష్యత్తులో ఈ సంఖ్యను 12కు పెంచే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. అదే జరిగితే పట్నా వేదికగా బిహార్ జట్టు ఐపీఎల్‌లో ప్రవేశించే అవకాశంపై చర్చ మరింత ఊపందుకుంది.
వైభవ్ సూర్యవంశీ సృష్టించిన ఈ “వైభవ్ ఎఫెక్ట్” కారణంగా బిహార్‌లో క్రికెట్ మార్కెట్ వేగంగా పెరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఈ ప్రతిపాదన నిజరూపం దాల్చితే, స్థానిక ప్రతిభావంతులకు మరిన్ని అవకాశాలు దక్కే అవకాశం ఉంటుందని కూడా అభిప్రాయపడుతున్నారు.








