CM Revanth Reddy: తీవ్రమైన వడగాలులు, ఎండ తీవ్రత(HeatWave) నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉండడంతో జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వడదెబ్బ వంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగినంతగా అందుబాటులో ఉంచాలని, తాగునీటి సరఫరా, విద్యుత్ సేవలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
వడదెబ్బతో బాధితులు ఆసుపత్రులకు వస్తే తక్షణ వైద్యసహాయం అందించాలని సీఎం ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే మధ్యాహ్నం వేళల్లో అనవసర ప్రయాణాలు చేయకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాల పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కలెక్టర్లకు తగిన దిశానిర్దేశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.








