Kuppam Palm Fruits: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి గ్రామీణ జీవనశైలికి దగ్గరగా ఉన్న అరుదైన దృశ్యం ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కుప్పంకు ప్రయాణిస్తున్న సమయంలో సీఎం దంపతులు రహదారి పక్కన తాటి ముంజలు విక్రయిస్తున్న ఓ పేద కార్మికుడిని గమనించారు. వెంటనే వారు వాహనం ఆపి స్వయంగా కిందికి దిగి, ఆ కార్మికుడి వద్ద తాటి ముంజలు కొనుగోలు చేశారు.
అంతేకాకుండా అతనితో ఆప్యాయంగా మాట్లాడి అతని కుటుంబ పరిస్థితులు, జీవన విధానం గురించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సాధారణమైన కానీ హృదయానికి హత్తుకునే ఘటన అక్కడున్న వారిని ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ, “కల్తీ లేదు, కార్బైడ్ లేదు, పురుగు మందుల గోల లేదు.. కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్ఛమైన తాటి ముంజలు తింటుంటే ఎంతో హాయిగా ఉంది” అని పేర్కొన్నారు.
సీఎం దంపతుల ఈ నిరాడంబరతను స్థానికులు ప్రశంసించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సాధారణ ప్రజలతో ఇలా మమేకమవడం అరుదైన విషయమని అక్కడి ప్రజలు అభిప్రాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.








