కేరళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో అత్యంత వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్ కేరళ(VD Satheesan) నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు.
ముఖ్యమంత్రి వీడీ సతీశన్‌తో పాటు పూర్తి స్థాయి మంత్రివర్గం కూడా ఒకేసారి బాధ్యతలు స్వీకరించింది. సీఎంతో కలిపి మొత్తం 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అందరితోనూ దైవసాక్షిగా ప్రమాణం చేయించారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పు చోటుచేసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వంతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలు హాజరయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.
అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తదితర ప్రముఖులు హాజరై కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.
కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా కార్యక్రమానికి హాజరై నూతన సీఎం వీడీ సతీశన్‌కు అభినందనలు తెలియజేశారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, UDF మద్దతుదారులు కార్యక్రమానికి తరలివచ్చారు. కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనుందని పార్టీ నేతలు వెల్లడించారు.








