IND vs SA 3rd ODI: భారత్, సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్‌ను నిర్ణయించే మూడో పోరు విశాఖపట్నంలోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగింది. తొలిరెండు మ్యాచ్‌ల్లో చెరో విజయంతో సిరీస్ సమంగా నిలవడంతో ఈ పోరుపై భారీ ఆసక్తి నెలకొంది. వరుసగా 20 వన్డేలలో టాస్ ఓడిన భారత్ ఈసారి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం కీలక ఘట్టమైంది.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు ఓపెనర్ క్వింటన్ డి కాక్ అద్భుతమైన ఇన్నింగ్స్ అందించాడు. ఫామ్‌లో లేకపోయినా ఈ మ్యాచ్‌లో 80 బంతుల్లో సెంచరీ నమోదు చేసి మొత్తం 106 పరుగులు చేశాడు. కెప్టెన్ టెంబా బావుమాతో 113 పరుగుల భాగస్వామ్యం జట్టుకు బలాన్నిచ్చింది.
అయితే చివర్లో భారత బౌలర్లు కీలక వికెట్లు తీసి సౌతాఫ్రికాను 47.5 ఓవర్లలో 270 పరుగులకే ఆపగలిగారు.
ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు తీసి దక్షిణాఫ్రికా మధ్య, లోయర్ ఆర్డర్‌ను కట్టడి చేశారు. అర్ష్‌దీప్ ప్రారంభంలో విజయాన్ని అందించగా జడేజా కీలక వికెట్ సాధించాడు.
సిరీస్ విజయం కోసం భారత్ 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ ప్రదర్శనపై అభిమానుల అంచనాలు ఉన్నాయి.
