బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా ఓ ప్రముఖ ఇంగ్లీష్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాలపై ఆమె అభిప్రాయాలను పంచుకుంటూ, గులాబీ పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లపై స్పందించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తన ఆసక్తిని వ్యక్తం చేస్తూ, వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించారు.
కవిత మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో జగన్ ఓ మంచి ప్రతిపక్ష నాయకుడిగా పోరాడుతున్నారన్నారు. ఆయనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, తనకు ఆయన అంటే ఇష్టమని తెలిపారు. “జగన్ మోహన్ రెడ్డి 2.0 చాలా బాగా నచ్చింది. ఆయన ఎన్నో కష్టాలను తట్టుకుని ఇప్పుడు విపక్షంగా గట్టి పోరాటం చేస్తున్నారు” అని కవిత ప్రశంసించారు.
అదే ఇంటర్వ్యూలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ఆ పదవి దురదృష్టవశాత్తూ దక్కిందని వ్యాఖ్యానించారు. పవన్ సీరియస్ నాయకుడు కాదని, రాజకీయాల్లో ఆయన చేసే వ్యాఖ్యలు పొంతనలేకుండా ఉంటాయని మండిపడ్డారు. ప్రజలు అతని మాటలను పెద్దగా పట్టించుకోరన్నది ఆమె అభిప్రాయం.
కవిత మరో కీలక వ్యాఖ్య చేస్తూ, ఏపీలో వైసీపీ మినహా మిగిలిన అన్ని పార్టీలతో పవన్ పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. ఇలాంటి రాజకీయాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పవన్ కళ్యాణ్ స్థిరమైన నేతగా కాకుండా, విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే నాయకుడిగా మారిపోయాడని ఆమె అభిప్రాయపడారు.