విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం మొరకముదాం మండల జనసేన ఇన్‌చార్జ్ రౌతు కృష్ణవేణి, బొత్స సత్యనారాయణపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఆయన విద్యార్థులకు ఏం చేశారని నిలదీశారు. కూటమి ప్రభుత్వంపై ఆయన చేసే వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు చెప్పినట్లు ఉన్నాయన్నారు.
బొత్స సత్యనారాయణ మంత్రి పదవిలో ఉండగా విద్యా రంగం ఎంత మేరకు అభివృద్ధి చెందిందని ప్రశ్నించారు. పాఠశాలల్లో కనీస వసతులు కల్పించకుండా విద్యార్థులను తీవ్ర అవస్థలకు గురి చేశారని ఆరోపించారు. నేడు జనసేన-తెలుగుదేశం కూటమిపై విమర్శలు చేయడం సరికాదని కౌంటర్ ఇచ్చారు.
బొత్స కుటుంబ పాలన వల్ల చీపురుపల్లిలో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని కృష్ణవేణి ఆరోపించారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా, విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా మంత్రిగా బాధ్యత తప్పించుకున్నారని విమర్శించారు.
జనసేన కూటమి పాలనలో విద్యా రంగాన్ని అభివృద్ధి చేసి, యువత భవిష్యత్తును మెరుగుపరచడానికి కృషి చేస్తామని కృష్ణవేణి స్పష్టం చేశారు. ప్రజలు బొత్స మాటలను నమ్మే స్థితిలో లేరని, జనసేన అభివృద్ధి కోసం పనిచేస్తుందని తెలిపారు.