తిరుపతి జిల్లా భాకరాపేట అటవీ ప్రాంతంలోని దేవరకొండ మెయిన్ రోడ్డు వద్ద 32 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. దీంతో మోటార్ సైకిల్, లగేజీ వాహనంతో ఎర్రచందనం తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాలతో, డీఎస్పీ బాలిరెడ్డి మార్గదర్శకత్వంలో ఈ ఆపరేషన్ చేపట్టారు. ఆర్ఐ సాయి గిరిధర్ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ బృందం అటవీ ప్రాంతంలో ముమ్మర తనిఖీలు చేపట్టి స్మగ్లర్లను పట్టుకున్నారు. వారిని చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.
స్మగ్లర్లు పారిపోవడానికి ప్రయత్నించినప్పటికీ, పోలీసులు వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. లగేజీ వాహనాన్ని తనిఖీ చేయగా, 32 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. పట్టుబడ్డ దుంగల విలువ సుమారు రూ.40 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటిని అక్రమంగా తరలించేందుకు ప్రత్యేక నెట్‌వర్క్ ఉపయోగిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
పట్టుబడ్డ స్మగ్లర్లను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్మగ్లింగ్ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేపట్టి, దీనికి సంబంధిత ముఠాను అదుపులోకి తీసుకునే చర్యలు కొనసాగిస్తున్నట్లు సీఐ సురేష్ కుమార్ తెలిపారు.