2027 bmw i7 Series: జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ BMW తన ఫ్లాగ్‌షిప్ సెడాన్ BMW 7 Series 2027 మోడల్‌ను కొత్త డిజైన్, అత్యాధునిక టెక్నాలజీతో విడుదల చేసింది. కొత్త మోడల్ ప్రారంభ ధర సుమారు 1,01,350 డాలర్లుగా నిర్ణయించగా, ఇది గత వెర్షన్‌తో పోలిస్తే స్వల్పంగా మాత్రమే ఎక్కువ. “న్యూ క్లాస్” డిజైన్ తత్వానికి అనుగుణంగా ఈ కారులో ఎక్స్‌టీరియర్, ఇన్‌టీరియర్‌లో గణనీయమైన మార్పులు చేశారు.
బయటి డిజైన్‌లో కొత్త కిడ్నీ గ్రిల్, స్లిమ్ హెడ్‌లైట్స్, రీడిజైన్ చేసిన టెయిల్‌లైట్స్ ఆకట్టుకుంటాయి. లోపల పానోరమిక్ ఐడ్రైవ్ స్క్రీన్‌ను విండ్షీల్డ్ అడుగుభాగంలో పిలర్ నుంచి పిలర్ వరకు అమర్చారు. అదనంగా, ప్యాసింజర్ కోసం ప్రత్యేక డిస్‌ప్లే స్క్రీన్‌ను స్టాండర్డ్‌గా అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
శక్తివంతమైన ఇంజిన్, ఎలక్ట్రిక్ ఆప్షన్స్
740 రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్‌లో 3.0 లీటర్ టర్బో ఇంజిన్‌ను అందించారు. ఇది 394 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు ఎలక్ట్రిక్ వేరియంట్ i7 xDrive50లో డ్యూయల్ మోటార్ సెటప్‌తో 449 హార్స్‌పవర్, 660 న్యూటన్ మీటర్ల టార్క్ లభిస్తుంది. టాప్ స్పీడ్ 209 కిలోమీటర్ల వరకు ఉండగా, i7 xDrive60 వేరియంట్‌లో ఇది 240 కిలోమీటర్ల వరకు చేరుతుంది.
28 నిమిషాల్లో ఫాస్ట్ చార్జింగ్
కొత్త బ్యాటరీ టెక్నాలజీతో 112 కిలోవాట్ అవర్ సామర్థ్యం కలిగి ఉన్న ఈ మోడల్ కేవలం 28 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు చార్జ్ అవుతుంది. పూర్తి చార్జ్‌తో 563 కిలోమీటర్లకు పైగా రేంజ్ అందిస్తుంది. 2027 BMW 7 సిరీస్ ఉత్పత్తి జూలై నుంచి ప్రారంభం కానుందని కంపెనీ వెల్లడించింది.








