West Bengal Elections: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ముర్షిదాబాద్ జిల్లాలోని నవోదా ప్రాంతంలో ఒక పోలింగ్ బూత్ సమీపంలో నాటు బాంబు దాడి జరగడం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తి బాంబు విసరడంతో పలువురు గాయపడగా, ఓటర్లు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.
ఈ ఘటన వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. దాడి చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. పోలింగ్ ప్రక్రియను అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఈ దాడి జరిగిందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో తొలి విడతలో భాగంగా 152 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 16 జిల్లాల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా, ఈ దశలోనే 1,478 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వచ్చే వారం మిగిలిన స్థానాలకు పోలింగ్ జరగనుంది.
ఈ ఎన్నికల్లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తాజా ఘటనతో రాష్ట్రంలో ఎన్నికల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.








