భారత్ చుట్టుపక్కల ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు పాకిస్తాన్ కొత్త కుట్రలు పన్నుతోందని భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం పాక్ మద్దతుతో ఉగ్ర సంస్థలు భారత్ సరిహద్దు దేశాలైన “నేపాల్, బంగ్లాదేశ్” ప్రాంతాల్లో ఉగ్ర స్థావరాలు, శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
భారత్-నేపాల్, భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులకు సమీపంలో ఈ శిబిరాలను నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, “ఆపరేషన్ సిందూర్” తర్వాత ఈ చర్యలు మరింత వేగం పుంజుకున్నాయని నిఘా వర్గాలు వెల్లడించాయి.
బంగ్లా, నేపాల్ సరిహద్దు సమీప రాష్ట్రాల్లో ఇటీవల పాకిస్తాన్ మద్దతుగల ఉగ్రవాదులను అరెస్టు చేసిన అనంతరం, దర్యాప్తులో ఈ నెట్వర్క్‌పై కీలక ఆధారాలు లభించాయి.
దీనితో సరిహద్దు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారని అధికారులు తెలిపారు. పొరుగు దేశాల్లో విదేశీ నిధులతో నడుస్తున్న పలు ప్రాజెక్టులపై కూడా నిఘా కొనసాగుతోందని పేర్కొన్నారు.
ALSO READ:భర్త మహాశయులకు విజ్ఞప్తి” రవితేజ కొత్త సినిమా గ్లింప్స్ విడుదల
లష్కరే తయ్యిబా (LeT), జైషే మహమ్మద్ (JeM) సంస్థలు నేపాల్‌లో తమ కార్యకలాపాలను విస్తరించడానికి ప్రయత్నిస్తుండగా, అల్ ఖైదా, ఐసిస్ బంగ్లాదేశ్‌లో గత ఐదు నెలలుగా తమ స్థావరాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.
తుర్కియే ఈ శిబిరాలకు నిధులు సమకూరుస్తోందని, ఢాకాలోని “జమాత్-ఇ-ఇస్లామీ కార్యాలయం” పునరుద్ధరణకు కూడా తుర్కియే మద్దతు ఉన్నట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
