దేశ రాజధాని దిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన దర్యాప్తులో సంచలన నిజాలు బయటకి వస్తున్నాయి. ఈ ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడుకు కారణమైన కారు చివరిగా కశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన వైద్యుడు కొనుగోలు చేసినట్లు సమాచారం.
అతనికి హరియాణా ఫరీదాబాద్‌లోని ఉగ్ర మాడ్యూల్‌తో సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
ఇక జమ్మూకశ్మీర్ పోలీసులు ఇటీవల 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ వంటి పదార్థాలు స్వాధీనం చేయడంతో ఈ నెట్‌వర్క్‌పై ఆందోళన వ్యక్తమవుతోంది. ఫరీదాబాద్‌లో డా. ముజమ్మిల్, డా. అదీల్ అరెస్టు కావడంతో ఈ కేసు మరింత మలుపు తిరిగింది.
పేలుడు ఘటనలో ఉపయోగించిన కారు యజమాని డా. ఉమర్ మహ్మద్ అని గుర్తించారు. అతడు భయంతో ఆత్మాహుతి దాడి చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ALSO READ:జాతీయ రహదారుల ప్రమాదాలపై సుప్రీంకోర్టు ఆందోళన — NHAI, కేంద్ర రవాణా శాఖకు ఆదేశాలు
పేలుడు సమయంలో అతను కారులోనే ఉన్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఎర్రకోట నుంచి నగర కేంద్రం వైపు కారు కదులుతున్న దృశ్యాలు సీసీటీవీలో కనిపించాయి.
ఈ దాడిలో పెద్ద మొత్తంలో అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించినట్లు అధికారులు భావిస్తున్నారు. పుల్వామాలో తారిఖ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కారు అనేకసార్లు చేతులు మారినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటన దేశ భద్రతా వ్యవస్థను కదిలించగా, దర్యాప్తు బృందాలు పలు రాష్ట్రాల్లో సమన్వయ దర్యాప్తు ప్రారంభించాయి.
