భారత గేమింగ్ రంగంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. విన్‌జో గేమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫిర్యాదుతో మొదలైన దర్యాప్తులో గూగుల్ కీలక ప్రతిపాదనను సీసీఐ (కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) ఎదుట ఉంచింది. దీని ప్రకారం, గూగుల్ ఇప్పుడు రియల్ మనీ గేమింగ్ (RMG) యాప్‌లను గూగుల్ ప్లేలో అనుమతించేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించింది.
ఇప్పటివరకు గూగుల్ పైలట్ ప్రోగ్రామ్ ద్వారా కొన్ని పరిమిత RMG యాప్‌లకే మాత్రమే అవకాశం కల్పించగా, తాజా ప్రతిపాదనల ప్రకారం నైపుణ్య ఆధారిత అన్ని గేమింగ్ యాప్‌లకు సమాన అవకాశాలు ఇవ్వాలని భావిస్తోంది. గూగుల్ యాడ్స్ పాలసీలో మార్పులు చేసి, నైపుణ్య ఆధారిత గేమింగ్ యాప్‌ల ప్రకటనలకు కూడా అవకాశం ఇవ్వనుంది. అయితే దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయని గూగుల్ స్పష్టం చేసింది. ప్రభుత్వ నియంత్రణ సంస్థల ప్రమాణాలకు అనుగుణంగా ధ్రువీకరణ పొందిన యాప్‌లకే అనుమతిస్తామని తెలిపింది.
గూగుల్ ఓ స్పష్టమైన హామీ కూడా ఇచ్చింది. “ఏ ఒక్క యాప్‌కూ అన్యాయం జరగకుండా చూస్తాం. ఎవరు సరైన ప్రమాణాలు పాటిస్తారో, వారికి సమాన అవకాశాలు ఇస్తాం” అని సీసీఐకి తెలిపింది. అన్ని రకాల రియల్ మనీ గేమింగ్ యాప్‌లు – అవి పెద్దవి కావచ్చు, కొత్తవి కావచ్చు – సమానంగా గూగుల్ ప్లే, గూగుల్ యాడ్స్ వేదికల్లో పాల్గొనవచ్చని తెలిపింది.
మరొక కీలక అంశం – ఇప్పటివరకు గూగుల్ ‘పైలట్ ప్రోగ్రాం’ ద్వారా DFS (డైలీ ఫాంటసీ స్పోర్ట్స్), రమ్మీకి చెందిన యాప్‌లకే అవకాశం ఇచ్చింది. కానీ ఈ ప్రోగ్రాం కొత్త యాప్‌లకు అడ్డుపడుతోందని సీసీఐ అభిప్రాయపడింది. దాంతో, గూగుల్ తన పైలట్ ప్రోగ్రాంను రీప్లేస్ చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపింది. భారతదేశ చట్టాల ప్రకారం నడుచుకునే RMG యాప్‌లను ఇప్పుడు గూగుల్ ప్లేలో డిస్ట్రిబ్యూట్ చేయనున్నట్లు పేర్కొంది.
గూగుల్ మరో కీలక విషయం స్పష్టం చేసింది. రియల్ మనీ గేమింగ్ యాప్‌ల నుంచి వచ్చే ‘పేమెంట్ హెచ్చరికలు’ డెవలపర్ల ప్రోగ్రామింగ్ వల్లే జరుగుతాయని తెలిపింది. వినియోగదారుల భద్రత కోసం వీటిని R.B.I, N.P.C.I ప్రమాణాలకు అనుగుణంగా మార్చనున్నట్లు తెలిపింది. ఈ ప్రతిపాదనలపై ఆగస్టు 20 లోగా ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని సీసీఐ ప్రకటించింది.
ఇదే సమయంలో విన్‌జో గేమ్స్ కంపెనీ స్పందించింది. గూగుల్ ప్రతిపాదనలు పరిశీలిస్తున్నామని, వివక్ష లేకుండా వ్యవహరిస్తే చాలని అభిప్రాయపడింది. కానీ గూగుల్ వాణిజ్య నమూనా ఎలా ఉంటుంది? ఎప్పుడు అమలులోకి వస్తుంది? అనే అంశాలపై ఇంకా స్పష్టత ఇవ్వలేదని విన్‌జో పేర్కొంది. గూగుల్ నుండి వాస్తవికమైన సమయరేఖ, విధివిధానాలు రావాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ఈ పరిణామాలు భారతదేశ గేమింగ్ రంగానికి కొత్త దారితీయనున్నాయి. నైపుణ్య ఆధారిత గేమింగ్ యాప్‌లకు మరింత పారదర్శకత, సమాన అవకాశాలు రావడం గేమింగ్ స్టార్టప్‌లకు ఊతమిచ్చే అంశంగా మారనుంది. ప్రజల అభిప్రాయాల నేపథ్యంలో సీసీఐ తుది నిర్ణయం ఎలా ఉండనుందో అనే ఆసక్తికర పరిస్థితి ఇప్పుడు నెలకొంది.