ప్రజా సమస్యలపై తన గళం ఎత్తిన ప్రతిసారి కేంద్ర దర్యాప్తు సంస్థలు తనను లక్ష్యంగా తీసుకుంటున్నాయని రాబర్ట్ వాద్రా ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా గురుగ్రామ్ భూముల వ్యవహారంపై మనీలాండరింగ్ కేసులో ఈడీ నోటీసులు అందాయని చెప్పారు. గత 20 ఏళ్లలో 15 సార్లు నోటీసులు వచ్చాయని, తాను అధికారులు అడిగిన ప్రతీ పత్రాన్ని సమర్పించానని తెలిపారు.
తాను రాజకీయాల్లోకి వస్తే తమకు ముప్పుగా మారుతానని భావించి బీజేపీ కక్షసాధింపు చర్యలకు దిగుతోందని విమర్శించారు. తనపై వేసే కేసుల్లో ఏమీ లేదని, తాను ఏమాత్రం భయపడనని స్పష్టం చేశారు. ప్రతి విచారణలో నిబంధనలకు అనుగుణంగా సహకరిస్తానని పేర్కొన్నారు. కేంద్ర సంస్థలు తమ అసలు పనిని మరిచి, బీజేపీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తున్నాయన్నారు.
తాజా నోటీసులపై నిరసనగా ఢిల్లీకి చెందిన తన నివాసం నుంచి ఈడీ కార్యాలయం వరకు నడుచుకుంటూ వెళ్లిన వాద్రా, మీడియాతో మాట్లాడారు. మోదీ భయంతోనే ఇలా ప్రతీకార చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజల తరఫున నిలిచినంత మాత్రాన తనను వేధించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
‘ప్రధాని మోదీ భయపడినప్పుడల్లా ఈడీ నన్ను వెంటాడుతుంది’ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ చిన్న రాజకీయాలకు పాల్పడుతోందని, తాను రాజకీయాల్లోకి వస్తే ప్రజల మద్దతు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈడీ, ఐటీ, సీబీఐ సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలనే ఆశను ప్రజలు ఇప్పటికీ ఉంచుకున్నారని వ్యాఖ్యానించారు.