UPSC CSE 2025: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Union Public Service Commission) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష 2025 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అనుజ్ అగ్నిహోత్రి ఆల్ ఇండియా ర్యాంక్–1 సాధించి ప్రతిభ చాటుకున్నారు.
మొత్తం 958 మంది అభ్యర్థులు వివిధ ప్రతిష్ఠాత్మక సేవలకు ఎంపికయ్యారు. ఇందులో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి కీలక పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in లేదా upsconline.gov.in (CHECK HERE)లో తమ రోల్ నంబర్ ద్వారా ఫలితాలను చూసుకుని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ ఏడాది టాప్ ర్యాంకుల్లో అనుజ్ అగ్నిహోత్రి మొదటి స్థానంలో నిలవగా, రాజేశ్వరి సువే రెండో ర్యాంక్, ఆకాంక్ష్ మూడో ర్యాంక్ సాధించారు. రాఘవ్ ఝున్‌ఝున్‌వాలా నాల్గవ స్థానంలో, ఇషాన్ భట్నాగర్ ఐదవ స్థానంలో నిలిచారు.
మొత్తం ఎంపికైన 958 మంది అభ్యర్థుల్లో 317 మంది జనరల్ కేటగిరీకి చెందినవారు. అలాగే 104 మంది ఈడబ్ల్యూఎస్, 306 మంది ఓబీసీ, 158 మంది ఎస్సీ, 73 మంది ఎస్టీ వర్గాలకు చెందినవారు ఉన్నారు.
ఈ ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి 15 రోజులు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని యూపీఎస్‌సీ ప్రకటించింది. 2025 ఆగస్టులో రాతపరీక్షలు నిర్వహించగా, 2025 డిసెంబర్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు పర్సనాలిటీ టెస్ట్‌లు నిర్వహించారు.
ప్రతీ ఏడాది సివిల్ సర్వీసెస్ పరీక్షలను మూడు దశల్లో నిర్వహిస్తారు. మొదట ప్రిలిమినరీ పరీక్ష, తర్వాత మెయిన్స్ రాతపరీక్ష, చివరగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రభుత్వ సేవల్లో పనిచేసే అధికారులను ఎంపిక చేసే ప్రక్రియలో ఈ పరీక్షకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.









