తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు మరియు వడగళ్ల వానలు అన్నదాతలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో కోతకు సిద్ధమైన పంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మార్కెట్లకు తీసుకువచ్చిన ధాన్యాన్ని వరద నీరు నాశనం చేసింది. వడగళ్ల వాన ధాన్యం, మామిడి పంటలను తీవ్రంగా దెబ్బతీసింది.
ఒకటిరెండు జిల్లాల్లో కాదు, జనగామ, సిద్దిపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో దాదాపు పది వేల ఎకరాల పంట నష్టం జరిగింది. కొన్ని గ్రామాల్లో మామిడికాయలు చెట్లకే ఉండకుండా నేలకి రాలిపోవడం రైతులకు తీవ్ర నిరాశను కలిగిస్తోంది.
ఇప్పటికే గత నెల చివరి వారం నుంచి రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వ్యవసాయ శాఖ సమర్పించిన నివేదిక ప్రకారం మొత్తం 50 వేల ఎకరాలకు పైగా నష్టం జరిగినట్టు తెలుస్తోంది. మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్ 2 వరకు కురిసిన వర్షాల వల్ల 8 వేల ఎకరాల్లో నష్టం నమోదైందని అధికారులు తెలియజేశారు.
ఈ పరిస్థితే దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ నెల 2 తర్వాత కురిసిన వర్షాలకు సంబంధించి అధికారులు సర్వే చేస్తున్నారు. నివేదిక అందిన తర్వాత ఈ నెల 25న నష్టపరిహారం ప్రకటించే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ఈ నెలాఖరు వరకు వర్షాలు కొనసాగనున్నట్లు హెచ్చరించడంతో, రైతులు వరి కోతలను వాయిదా వేస్తున్నారు.