తిరుమలలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాద సేవలో కొత్తగా వడలను కూడా చేర్చారు. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్వయంగా ప్రకటించారు. టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అన్నప్రసాద మెనూలో అదనంగా కొత్త పదార్థాన్ని చేర్చాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ఆమోదంతో వడలను వడ్డించాలని నిర్ణయించినట్లు వివరించారు.
ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తులకు వడలను వడ్డిస్తామని టీటీడీ తెలిపింది. భక్తుల కోసం శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదాన్ని మరింత రుచికరంగా అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, వడల కోసం నాణ్యమైన దినుసులు వినియోగించనున్నామని బీఆర్ నాయుడు తెలిపారు.
ప్రస్తుతం రోజుకు 35 వేల వడలను భక్తులకు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. భవిష్యత్తులో భక్తుల సంఖ్య పెరిగే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ సంఖ్యను మరింత పెంచాలని యోచిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఉత్తమమైన అన్నప్రసాద సేవ అందించడమే తమ లక్ష్యమని చెప్పారు.
తిరుమల అన్నప్రసాద సేవ భక్తుల హృదయాలను గెలుచుకుంటోంది. అన్నప్రసాద విభాగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు టీటీడీ కృషి చేస్తోంది. భవిష్యత్తులో మరిన్ని రుచికరమైన పదార్థాలను చేర్చే అవకాశముందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి.


