TG20: తెలంగాణ క్రికెట్లో యువ ఆటగాళ్లకు కొత్త అవకాశాలను తెచ్చే దిశగా కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ క్రికెట్ లీగ్ (TG20)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర యువ క్రికెటర్లకు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే వేదిక అందుబాటులోకి వచ్చింది.
ఈ లీగ్ కేవలం ఒక టోర్నమెంట్ మాత్రమే కాకుండా, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన ఆటగాళ్లను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా రూపొందుతోంది. అద్భుత ప్రదర్శన చేసే క్రీడాకారులకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వంటి మెగా లీగ్‌లలో అవకాశాలు లభించే అవకాశం ఉందని HCA అధికారులు తెలిపారు.
బీసీసీఐ ఆమోదం రావడంతో HCA అపెక్స్ కౌన్సిల్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ బీసీసీఐ ప్రధాన కార్యదర్శికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ లీగ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో, పారదర్శకంగా నిర్వహిస్తామని HCA కార్యదర్శి జీవన్ రెడ్డి వెల్లడించారు.
ఇతర రాష్ట్రాల్లో విజయవంతమైన TNPL, KPL తరహాలోనే TG20 కూడా విజయవంతం అవుతుందని భావిస్తున్నారు. ఈ లీగ్ ద్వారా తెలంగాణ నుంచి మరిన్ని ప్రతిభావంతులు, ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ వంటి స్టార్ క్రికెటర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఫ్రాంచైజీల ఎంపిక, ఆటగాళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే షెడ్యూల్, వేదికలు, ప్రైజ్ మనీ వివరాలను ప్రకటించనున్నారు. ఫ్లడ్‌లైట్ మ్యాచ్‌లతో ఈ లీగ్ యువ ఆటగాళ్లకు ప్రొఫెషనల్ అనుభవాన్ని అందించనుంది.








