అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో శనివారం సాయంత్రం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కెల్లామ్ స్ట్రీట్‌లో ఉన్న రెండు అపార్టుమెంట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు క్రమంగా బిల్డింగ్ మొత్తం వ్యాపించడంతో భారీగా పొగలు, అగ్నికీలలు ఎగసిపడ్డాయి. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా, సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
అపార్టుమెంట్లలో ఆ సమయంలో ఉండే పది మంది తెలుగు విద్యార్థులను ఫైర్ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. వారిలో ఇద్దరికి తీవ్రమైన గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ప్రస్తుతం గాయపడిన వారు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.
ఈ విద్యార్థులంతా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారని అధికారులు తెలిపారు. అలబామా విశ్వవిద్యాలయంలో వారు విద్యనభ్యసిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో మంటలు చాలా వేగంగా వ్యాపించాయని, అందులో ఒకరు పొగల కారణంగా బయటకు రాలేకపోయారని సహచర విద్యార్థుల్లో ఒకరు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
అనూహ్యంగా జరిగిన ఈ అగ్నిప్రమాదం నుంచి బయటపడటం తమ అదృష్టంగా భావిస్తున్నామని విద్యార్థులు తెలిపారు. మంటల్లో అపార్టుమెంట్లు పూర్తిగా దగ్ధమయ్యాయని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రస్తుతం తాత్కాలిక నివాసంలో ఉన్నారు. స్థానిక సంఘాలు వారికి సహాయం అందిస్తున్నాయి.