Telangana She Netram: మహిళల భద్రత కోసం తెలంగాణ పోలీసులు అత్యాధునిక టెక్నాలజీతో కొత్త చర్యలు చేపడుతున్నారు. బస్టాండ్లు, కాలేజీలు, షాపింగ్ మాల్స్, రద్దీ ప్రాంతాల్లో మహిళలను వేధించే ఆకతాయిలను అడ్డుకునేందుకు షీ టీమ్స్ సేవలను మరింత విస్తరించారు. మహిళల రక్షణ కోసం ‘షీ నేత్రం’ పేరుతో ప్రత్యేక వ్యవస్థను రంగంలోకి దింపారు.
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు షాపింగ్ మాల్స్ ట్రయల్ రూమ్స్, హోటళ్లు, హాస్టళ్లలో రహస్య కెమెరాలు ఉన్నాయా అనే విషయాన్ని అత్యాధునిక పరికరాలతో తనిఖీ చేస్తున్నాయి. మహిళల ప్రైవసీకి భంగం కలిగించే చర్యలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటున్నారు.
ఇక అత్యవసర సమయాల్లో మహిళలకు తక్షణ సహాయం అందించేందుకు ‘స్పందన’ పేరుతో ఆల్ ఉమెన్ ఫస్ట్ రెస్పాండర్ సిస్టమ్‌ను ప్రారంభించారు. డయల్ 100, 112 కంట్రోల్ రూమ్‌లతో అనుసంధానమైన ఈ వ్యవస్థ ద్వారా కాల్ వచ్చిన కొద్ది నిమిషాల్లోనే మహిళా పోలీస్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంటున్నారు.
మహిళల భద్రతపై అవగాహన కల్పించేందుకు ‘స్టాండ్ విత్ హర్’ ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. వేధింపులను చూసి మౌనంగా ఉండకుండా పురుషులు కూడా స్పందించాలని పోలీసులు పిలుపునిస్తున్నారు. మరోవైపు మహిళల ఆర్థిక సాధికారత కోసం ‘బిజిలీ రైడ్’ ప్రాజెక్ట్ ద్వారా మహిళా డ్రైవర్లకు శిక్షణ అందిస్తున్నారు.
ఆన్‌లైన్ వేధింపులు, సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టేవారిపై కూడా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పదేపదే వేధింపులకు పాల్పడేవారిపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు. మహిళలు ఎలాంటి వేధింపులు ఎదురైనా వెంటనే 100, 112 లేదా షీ టీమ్స్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.








