CM రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది కార్మికులకు భరోసానిస్తూ కనీస వేతనాల పెంపు(Wage Hike)ను అధికారికంగా ప్రకటించారు. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని దాదాపు 1.11 కోట్ల మంది కార్మికులకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. ఈ సవరించిన కొత్త వేతనాలు వచ్చే జూన్ 1వ తారీఖు నుంచి అమల్లోకి రానున్నాయి.
ఈ సందర్భంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత పదేళ్ల పాలనలో కనీస వేతనాల సవరణపై నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. తమ ప్రభుత్వం కార్మిక సంక్షేమానికి కట్టుబడి ఉందని, అందుకే త్వరితగతిన వేతన సవరణ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు.
వేతనాల పెంపు కోసం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించారు. మున్సిపల్ కార్పొరేషన్లు జోన్-1గా, మున్సిపాలిటీలు జోన్-2గా, గ్రామీణ ప్రాంతాలు జోన్-3గా నిర్ణయించారు. అలాగే కార్మికులను అన్‌స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హై స్కిల్డ్ అనే నాలుగు విభాగాలుగా వర్గీకరించారు.
జోన్-1 పరిధిలో కొత్త వేతనాల ప్రకారం అన్‌స్కిల్డ్ కార్మికులకు రూ.16,000, సెమీ స్కిల్డ్ వారికి రూ.17,000, స్కిల్డ్ కార్మికులకు రూ.18,500, హై స్కిల్డ్ కార్మికులకు రూ.20,000 వరకు వేతనం పెరిగింది.
ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి యువత ఉపాధి, నైపుణ్యాలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. డిగ్రీ మాత్రమే సరిపోదని, స్కిల్స్ పెంపుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఏఐ యుగంలో బ్లూ కాలర్ ఉద్యోగాలకు పెద్దగా ప్రమాదం ఉండదని, వైట్ కాలర్ ఉద్యోగాల్లో మాత్రమే మార్పులు వస్తాయని తెలిపారు. విదేశాల్లోనూ విస్తృత అవకాశాలు ఉన్నాయని, నైపుణ్యాలు పెంచుకుంటే అధిక వేతనాలు పొందవచ్చని పేర్కొన్నారు.








