హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ నుంచి 100 శాతం వాటాలను కొనుగోలు చేయడంతో, మెట్రోపై పూర్తి నియంత్రణ ప్రభుత్వానికి చేరింది.
బుధవారం షేర్ బదిలీ ప్రక్రియ అధికారికంగా పూర్తవగా, సుమారు రూ.1,461.47 కోట్ల విలువైన వాటాను ప్రభుత్వం స్వీకరించింది. దీంతో మెట్రో ఆస్తులు, నిర్వహణ బాధ్యతలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చాయి. ఇప్పటి వరకు పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) పద్ధతిలో నడిచిన ఈ ప్రాజెక్టు ఇక పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో కొనసాగనుంది.
వాస్తవానికి మార్చి 31లోపు ఈ ప్రక్రియ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం మంజూరు ఆలస్యం కావడంతో గడువు ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. తాజాగా నిధులు అందడంతో ప్రభుత్వం నిర్ణయాన్ని అమలు చేసింది.
ఈ పరిణామంతో పలు లాభాలు ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా మెట్రో టికెట్ ధరలపై పూర్తి నియంత్రణ ప్రభుత్వానికి రావడం, ప్రయాణికులకు ఊరట కలిగించే అవకాశం ఉందని అంటున్నారు.
అలాగే రెండో దశ విస్తరణ పనులు వేగవంతం అయ్యే అవకాశముంది. ప్రైవేటు సంస్థల లాభాపేక్ష కంటే ప్రజా సేవకు ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉండటంతో మెట్రో సేవలు మరింత మెరుగుపడతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.








