Narendra Modi: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. కేరళ, తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఎన్నికల్లో కూడా ఎన్డీయే గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు నిర్మించిన 594 కిలోమీటర్ల గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో ఈసారి ఓటర్లు భయరహిత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య పండుగను శాంతియుతంగా నిర్వహిస్తున్నారని ఆయన ప్రశంసించారు.
అంతకుముందు వారణాసిలో ప్రధాని రోడ్ షో నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల గుండా సాగిన ఈ రోడ్ షో కాశీ విశ్వనాథ ఆలయం వద్ద ముగిసింది.
అనంతరం ఆలయంలో వేద మంత్రాల మధ్య ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో ప్రధాని పర్యటనకు రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది.









