Telangana government: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు త్వరలోనే మంచి అవకాశం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర పోలీసు విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.
పోలీసు శాఖను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలి దశలో సుమారు 5 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసు శాఖ నుంచి ఈ నియామకాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ఆర్థిక శాఖకు చేరినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం తెలంగాణ పోలీసు శాఖలో 19 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచారం. వీటిని ఒకేసారి కాకుండా దశలవారీగా భర్తీ చేయాలనే ప్రణాళికను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తొలి విడతలో 5 వేల పోస్టులను భర్తీ చేసిన తర్వాత మిగిలిన 14 వేల ఖాళీల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతులు లభించిన వెంటనే తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.
ప్రతి ఏడాది వేల సంఖ్యలో పోలీసు సిబ్బంది పదవీ విరమణ పొందుతుండటంతో శాఖలో సిబ్బంది కొరత పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణా వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బలగాలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కొత్తగా నియమించబడే సిబ్బందిలో ఎక్కువమందిని సైబర్ క్రైమ్ విభాగాలు, యాంటీ డ్రగ్స్ యూనిట్లలో నియమించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు ఆధునిక నేరాలను సమర్థంగా ఎదుర్కొనే విధంగా పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.








