CM Revanth Reddy: తెలంగాణలో ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. జీఎస్టీ వసూళ్లను పెంచడంతో పాటు పన్ను ఎగవేతను అరికట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేస్తోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్, ఉన్నతాధికారులతో కలిసి విస్తృతంగా సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై ప్రధానంగా చర్చించారు. జీఎస్టీ అధికారులకు డేటా ఆధారిత విశ్లేషణలు అందించే AI వ్యవస్థను అభివృద్ధి చేసి, పన్ను లీకేజీలను గుర్తించి నివారించడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. అదే సమయంలో వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, Ease of Doing Businessకు భంగం కలగకుండా చర్యలు ఉండాలని సూచించారు.
ముఖ్యంగా నిర్మాణ రంగంలో జరిగే పన్ను ఎగవేతను అరికట్టేందుకు మున్సిపల్, RERA, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖలను ఒకే AI ప్లాట్‌ఫారమ్‌తో అనుసంధానించాలని సీఎం ఆదేశించారు. భారీ నిర్మాణాలు, కాంట్రాక్ట్ పనులకు అవసరమైన నిర్మాణ సామగ్రి, పన్ను అంచనాలను అనుమతుల దశలోనే నమోదు చేసే విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఈ డేటాను మీ సేవ, ఆరోగ్యశ్రీ, సీఎం సహాయ నిధి వంటి సేవలతో అనుసంధానిస్తే పాలన మరింత సమర్థవంతంగా ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు.
ALSO READ: FCRA Amendment Bill | ‘ఇది మా అంతర్గత వ్యవహారం’.. అమెరికాకు భారత్ గట్టి సమాధానం








