CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ చెన్నైలో ట్రెడిషనల్ లూక్స్లో తన మేనేజర్ జగదీష్ పళనిసామి ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. తరచుగా నల్ల బ్లేజర్, తెల్ల చొక్కా, నల్ల ప్యాంటు ధరించి కనిపించే ఆయన, ఈసారి సాంప్రదాయ దుస్తుల్లో ప్రత్యక్షమై అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.
ఈ గృహప్రవేశానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. విజయ్ ఇంట్లోకి అడుగుపెట్టగానే అక్కడున్న వారు చప్పట్లతో స్వాగతం పలికారు. జగదీష్ కుటుంబ సభ్యులు ఆయనకు ఆత్మీయంగా ఆహ్వానం పలికారు. విజయ్ గత దశాబ్ద కాలంగా తన మేనేజర్ జగదీష్‌తో దగ్గరగా పనిచేస్తున్నారు. ఆయన సినిమా డేట్లు, ప్రొడక్షన్ సంబంధిత విషయాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.
విజయ్ నటించిన ‘మాస్టర్’, ‘లియో’ చిత్రాలకు కూడా జగదీష్ సహనిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల ఢిల్లీ పర్యటన సమయంలో కూడా జగదీష్ ఆయనతోనే ఉన్నారు. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో జరిగిన సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. గృహప్రవేశ వేడుకకు ముందు కూడా విజయ్ సచివాలయంలో సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపించారు. ఈ సందర్భంగా పలు పరిశ్రమ ప్రతినిధులు కూడా ముఖ్యమంత్రిని కలిశారు.








