నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేయడాన్ని నిరోధించేందుకు కఠిన చర్యలు చేపట్టారు. ఖాళీ స్థలాలు, రహదారుల పక్కన చెత్త వేస్తున్న వారిని గుర్తించి జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఇంటింటి చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే చెత్త ఇవ్వాలని సూచించారు.
స్వచ్ఛతను మెరుగుపరిచేందుకు కమిషనర్ సోమవారం 20వ డివిజన్ పరిధిలోని హనుమాన్ జంక్షన్, స్నేహ నగర్, అక్షయ గార్డెన్, వనంతోపు ప్రాంతాల్లో పర్యటించారు. అపార్ట్మెంట్ల నుంచి ఖాళీ స్థలాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయడం, నిర్మాణ సామాగ్రిని రోడ్లపై పడేయడం వంటి చర్యలను గుర్తించి, సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
సీసీ కెమెరాల ద్వారా వ్యర్థాలు వేసే వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. భవన నిర్మాణాల సమయంలో రోడ్లను ఆక్రమించడం, డ్రైన్ కాలువలను మూసివేయడం వంటి చర్యలను ఉపేక్షించబోమని తెలిపారు. ఆ ప్రమాణాలు పాటించని నిర్మాణాలపై నోటీసులు జారీ చేసి జరిమానాలు విధించనున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రామ్ మోహన్ రావు, ఈ.ఈ శేషగిరిరావు, వెటర్నరీ వైద్యుడు డాక్టర్ మదన్ మోహన్, రెవెన్యూ అధికారి ఇనాయతుల్లా, సర్వేయర్ కామేశ్వర రావు, వార్డు సచివాలయ కార్యదర్శులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రజలు నగర పరిశుభ్రతలో భాగస్వాములై సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.