అమెరికాలో తుపాను బీభత్సం – వేల ఇళ్లు నిరవధికంగా అంధకారంలో!

Deadly storms wreak havoc across the U.S., causing tornadoes, wildfires, and heavy snow, leaving thousands of homes without power.

అమెరికాలోని పలు రాష్ట్రాల్లో తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా, ఫ్లోరిడా, వర్జీనియా రాష్ట్రాల్లో అధికారులు టోర్నడో హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర కరోలినాలో బలమైన గాలుల కారణంగా పలు నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. మిసిసిపీలో ముగ్గురు మరణించగా, ఓక్లహామాలో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. టెక్సాస్, ఓక్లహామా, లూసియానాలలో ఏడు టోర్నడోలు ఇప్పటికే విధ్వంసం సృష్టించాయి.

తీవ్ర గాలుల కారణంగా టెక్సాస్‌లో సంభవించిన కార్చిచ్చులో 20కిపైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. పసిఫిక్ ప్రాంతం నుంచి రాబోతున్న పెను తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, హిమపాతం సంభవించనున్నట్లు అధికారులు హెచ్చరించారు. మంచు దట్టంగా కురవడంతో పలుచోట్ల రహదారులను మూసివేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా టెక్సాస్‌లో 51,000 ఇళ్లు, వర్జీనియాలో 27,000 ఇళ్లు, టెన్నెసీలో 17,000 ఇళ్లు విద్యుత్తు కోల్పోయాయి.

వాతావరణ అనిశ్చితి కారణంగా దేశవ్యాప్తంగా దాదాపు 800 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజల భద్రత దృష్ట్యా స్థానిక అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. టోర్నడోలు మరింత బలపడే అవకాశముండడంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు.

ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియాలోని తూర్పు ప్రాంతాన్ని ఆల్ఫ్రెడ్ తుపాను అతలాకుతలం చేసింది. క్వీన్స్‌లాండ్, బ్రిస్బేన్, న్యూ సౌత్‌వేల్స్‌లో భారీ వర్షాలు కురిశాయి. ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది. విద్యుత్తు కోతలు, రహదారుల మూసివేతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *