చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌ను ప్రకటించబోతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ ధోనీకి చివరి మ్యాచ్ కావొచ్చనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతున్న ఈ మ్యాచ్ అనంతరం ధోనీ తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ వార్తలకు మరింత బలమవుతున్న అంశం ఏమిటంటే, ధోనీ తల్లిదండ్రులు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా స్టేడియంలో వీక్షిస్తున్నారు. పాన్ సింగ్, దేవకి దేవి ఈ మ్యాచ్ కోసం చెన్నైకి వచ్చి, చిదంబరం స్టేడియంలో ధోనీ ఆటను చూస్తుండటం చాలా అరుదైన దృశ్యమని చెబుతున్నారు. గతంలో వీరు ఎప్పుడూ ఇలా మైదానానికి రాలేదని అభిమానులు చెబుతున్నారు.
ధోనీ పేరెంట్స్ మ్యాచ్ చూడటంతో పాటు, స్టేడియంలో ఎమోషనల్ వాతావరణం నెలకొన్నట్లు చెపాక్ వేదిక వద్ద కనిపిస్తోంది. అభిమానులు ధోనీ చివరి మ్యాచ్ కావొచ్చని భావించి భారీగా హాజరయ్యారు. అతని పేరుతో ప్లాకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ అతనిపై తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా “థ్యాంక్యూ ధోనీ” అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది.
అయితే ధోనీ మాత్రం ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలోనూ అతను తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఎవరికీ తెలియకుండా చప్పగా ప్రకటించిన సందర్భం ఉంది. దీంతో అభిమానులు, క్రికెట్ అభిమాన వర్గాలు ఈ రోజు మ్యాచ్ అనంతరం ఏదైనా అధికారిక ప్రకటన వచ్చే అవకాశాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.