మొహాలీ ఆసుపత్రికి రూ.35లక్షల పరికరాలు విరాళంగా ఇచ్చిన గిల్

As part of a CSR initiative, Shubman Gill secretly donated ₹35 lakh worth medical equipment to a Mohali hospital to improve healthcare services.

టీమిండియా యువ క్రికెటర్ శుభ్మన్ గిల్ తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న గిల్, తన స్వస్థలమైన మొహాలీలోని ఫేజ్-4 సివిల్ ఆసుపత్రికి సుమారు రూ. 35 లక్షల విలువైన వైద్య పరికరాలను విరాళంగా అందించాడు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంలో భాగంగా ఈ సహాయాన్ని అందించాడు.

ఈ విరాళాల్లో వెంటిలేటర్లు, ఐసీయూ బెడ్లు, ఆపరేషన్ థియేటర్ టేబుళ్లు, సీలింగ్ లైట్లు, సిరంజి పంపులు, ఎక్స్‌రే మెషీన్లు ఉన్నాయి. వీటిని ఆసుపత్రి అవసరాలను బట్టి వాడతామని మొహాలీ సివిల్ సర్జన్ డాక్టర్ సంగీతా జైన్ తెలిపారు. ఈ విరాళం వల్ల ఆసుపత్రి సేవలు మెరుగుపడతాయని, ఇతర ఆసుపత్రులకూ అవసరమైతే సాయంగా మారుతుందని ఆమె పేర్కొన్నారు.

గిల్ తన సహాయాన్ని ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా చేశాడు. అయితే ఆసుపత్రి అధికారులు ఈ విషయం బయటపెట్టారు. చిన్నతనంలో మొహాలీలోనే క్రికెట్ శిక్షణ తీసుకున్న గిల్, ఇప్పుడు అదే ప్రాంతంలో ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఈ ప్రాంతానికి అతనికి ప్రత్యేక అనుబంధం ఉంది.

ఈ విరాళ కార్యక్రమానికి గిల్ అత్త డాక్టర్ కుశాల్దీప్ కౌర్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్‌లో గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు మంచి ప్రదర్శన ఇస్తోంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. వచ్చే మ్యాచ్‌లో ఏప్రిల్ 19న నరేంద్ర మోదీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *