అమెరికాలోని షాపింగ్ మాల్స్ ఇటీవల కాలంలో సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం దిగుమతులపై విధిస్తున్న సుంకాల పెంపు వల్ల ధరలు పెరగనున్న నేపథ్యంలో, ప్రజలు ముందస్తుగా వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాల కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి.
తైవాన్ నుండి దిగుమతి అయ్యే వస్తువులపై సుమారు 32% ధరలు పెరగనున్నాయని అంచనా. దీనివల్ల ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, కంప్యూటర్లు వంటి వస్తువుల ధరలు మరింతగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. దాంతో, ప్రజలు భవిష్యత్తులో భారీ ఖర్చును మించిన ముందస్తు కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
టెక్సాస్‌కు చెందిన జాన్ గుటిరెచ్ అనే యువకుడు తన అనుభవాన్ని తెలియజేస్తూ, తైవాన్ బ్రాండ్ ల్యాప్‌టాప్ కొనాలనుకున్నానని, ధరలు పెరగనుండటంతో వెంటనే ఆర్డర్ చేశానని పేర్కొన్నారు. కార్లు, వాషింగ్ మెషిన్లు, ఫ్రిజ్ వంటి వస్తువులకు కూడా ఆర్డర్లు విపరీతంగా పెరుగుతున్నాయని కంపెనీలు వెల్లడించాయి.
ఆర్థికవేత్తలు మాత్రం ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుంకాల పెంపుతో వస్తువుల ధరలు పెరిగితే, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు. ఏప్రిల్ 5 నుండి ఈ సుంకాలు అమల్లోకి వచ్చాయి. ప్రారంభంగా 10% విధించగా, మిగతా వాటిని ఏప్రిల్ 10 నుండి వసూలు చేయనున్నారు. మే 27 వరకు కొన్ని దిగుమతులకు గరిష్ట గడువు ఉండటంతో, ప్రజలు అందులోపు కొనుగోళ్లు ముగించేందుకు తహతహలాడుతున్నారు.